రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా ‘నారి నారీ నడుమ మురారి’ సంక్రాంతి పండుగ సందర్భంగా రేపు 14 సాయంత్రం విడుదల కాబోతోంది.
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో సంయుక్త మీనన్ దర్శకుడు రామ్ అబ్బరాజు ఇబ్బంది పడేరకంగా మాట్లాడారు. “ప్రతీ ఈవెంట్, ఇంటర్వ్యూ జరిగే ముందే డైరెక్టర్‌గారు మాకు (హీరోయిన్లకు) ఫోన్లు చేసి, మెసేజులు పెట్టి నాగురించి, మన మూవీ గురించి బాగా చెప్పండి,” అని చెప్పారు.
అయితే నాదో ప్రశ్న. మేము మీ గురించి, మన సినిమా గురించి బాగా చెప్పాలి. కానీ మాగురించి మీరేం చెప్పారు?ఈ హీరోయిన్లతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఒక్క ముక్కలో సింపుల్‌గా ముగిస్తారు. ఇదేంటి? అందుకే మేము కూడా మీతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది,” అని నవ్వుతూ చెప్పారు.
పెద్ద హీరో హీరోయిన్లు, పెద్ద దర్శకులకు ఇలాంటి పరిచయాలు అవసరం లేదు. అయినా ఇలాంటి సందర్భాలలో ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకుంటారు. కొత్త దర్శకులు, కొత్త హీరోహీరోయిన్లకు ఈ అవసరం ఇంకా ఎక్కువుటుంది. కనుక ఒకరి గురించి మరొకరు తప్పకుండా కాస్త గట్టిగానే చెప్పుకోవాలి.
అప్పుడే ప్రేక్షకులు కూడా వారితో బాగా కనెక్ట్ అవుతారు. అది వారి సినిమాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సంయుక్త మీనన్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఈ మాట బహిరంగంగా వేదికపై కాకుండా వ్యక్తిగతంగా చెప్పి ఉంటే దర్శక నిర్మాతలు కూడా అర్థం చేసుకొని తదనుగుణంగా హీరోయిన్ల గురించి గట్టిగా చెప్పేవారు కదా?
వేదికపై నలుగురి ముందు ఆమె ఈవిధంగా నిలదీస్తున్నప్పుడు దర్శకుడు రామ్ అబ్బరాజు నవ్వినప్పటికీ ఇబ్బంది పడ్డారని అర్ధమవుతూనే ఉంది. ఆమె మాటలతో దర్శకుడు బాధపడితే, ఆమెతో ఇదే చివరి సినిమా కావచ్చు. దాని వలన నష్టపోయింది ఎవరు?ఆమె కదా?
కనుక వేదికపై మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే కాస్త ఆచితూచి మాట్లాడటం నేర్చుకోవాలి. లేదా ముందుగా ఏం మాట్లాడాలో ఆలోచించుకొని అది మాత్రమే మాట్లాడితే అందరికీ మంచిది.