ఓ చెక్ బౌన్స్ కేసులో ముంబయిలోని అంధేరి కోర్టు దర్శకుడు రాంగోపాల్ వర్మకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తికి సుమారు రూ.3.5 లక్షలకు చెక్ ఇచ్చారు. కానీ అది బౌన్స్ అవడంతో అతను రాంగోపాల్ వర్మకి ఆ విషయం తెలియజేసి తన సొమ్ము వాపసు చేయాలని కోరారు. కానీ రాంగోపాల్ వర్మ పట్టించుకోకపోవడంతో అతను కోర్టులో కేసు వేశాడు.
ఆ కేసులో రాంగోపాల్ వర్మకు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నోటీస్ అందుకున్న మూడు నెలల్లోగా మహేష్ చంద్రకి వడ్డీ, కోర్టు ఖర్చులతో కలిపి రూ.3.7 లక్షలు చెల్లించాలని లేకుంటే మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది.
కధ ఇంతవరకు వచ్చింది కనుక జైలుకి వెళ్ళకుండా తప్పించుకునేందుకు ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఆ డబ్బు చెల్లించేసి బయటపడతారేమో?అయినా రాంగోపాల్ వర్మ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత చిన్న మొత్తం ఇవ్వకుండా పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.