అగ్నివీరులకు మరో రెండేళ్ల సర్వీసు పొడిగింపు.. మంచిదే!

November 05, 2026


img

అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత, బయటకు వెళ్లాల్సిన 75 శాతం అగ్నివీరులకు మరో రెండేళ్ల పాటు సర్వీసు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 4న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి వెల్లడించారు. అగ్నివీరుల పనితీరుపై గత నాలుగేళ్లుగా సాయుధ దళాలు చేసిన సమీక్ష, సానుకూల అభిప్రాయాల ఆధారంగా ఈ మార్పు తీసుకొచ్చినట్లు తెలిపారు.

అగ్నిపథ్ పథకం ప్రకారం ఇప్పటివరకు నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత 25 శాతం మందిని ప్రతిభ ఆధారంగా రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునేవారు. మిగిలిన 75 శాతం మంది బయటకు వెళ్లాల్సి వచ్చేది. 

తాజా నిర్ణయంతో ఈ 75 శాతం మందికి మరో రెండేళ్ల పాటు సాయుధ దళాల్లో పనిచేసే అవకాశం కల్పించనున్నారు. 

ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత కూడా సాయుధ దళాల్లో కొనసాగాలని ఆసక్తి చూపే వారికి రెగ్యులర్ సైనికులుగా చేరే అవకాశం కల్పించనున్నారు. 

అయితే ఇందుకు సంబంధిత ఎంపిక ప్రమాణాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. రెండేళ్ల పొడిగింపు సమయంలో అధిక వేతనం, మెరుగైన ప్యాకేజీతో పాటు సీనియారిటీ ప్రయోజనాలు కూడా కల్పించనున్నారు.

అగ్నిపథ్ పథకం 2022 జూన్ 14న ప్రారంభమైంది. ఈ పథకం కింద తొలి విడతగా ఎంపికైన అగ్నివీరుల నాలుగేళ్ల సర్వీసు గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో మరింత మంది యువతకు సాయుధ దళాల్లో కొనసాగేందుకు అవకాశం లభించనుంది.


Related Post