హైదరాబాద్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసులో ఊహించని కొత్త ట్విస్ట్! ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపిఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి, నగరంలోని తన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి ఇంటికి వచ్చి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
అతని సోదరుడు వెంటనే అన్నని ఎస్ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. వైద్యులు అత్యవసరం వైద్యం చేసి అతని ప్రాణం కాపాడారు.
ఆత్మహత్యాయత్నం చేసే ముందు ఉదయ్ కృష్ణారెడ్డి రెండు పేజీల సూసైడ్ లెటర్ వ్రాశాడు. దానిలో తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన సదరు ట్రైనీ ఐపిఎస్ అధికారిణితో ఏడాదిగా రిలేషన్ షిప్‌లో ఉన్నానని, ఇద్దరికీ శారీరిక సంబంధం కూడా ఉందని పేర్కొన్నాడు.
ఆమె పెళ్ళయిన తర్వాత కూడా తమ మద్య శారీరిక సంబంధం కొనసాగించామని పేర్కొన్నాడు. ఆమెకు కామవాంచ ఎక్కువ కనుక తరచూ తనంతట తానే నా రూమ్‌కి వస్తుండేది. రూమ్‌కి రావద్దని ఆమెను పదేపదే చెప్పినా వస్తూనే ఉండేది.
అదేవిధంగా ఈ నెల 9న కూడా వచ్చినప్పుడు నేను తలుపు తీయకపోతే బయట నుంచి ఫోన్ చేసింది. ఆమె లోనికి రాగానే మా మధ్య గొడవ అయ్యింది. ఆమె నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నప్పుడు సాక్ష్యాధారాల కోసం నా ఐ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాను.
ఆమె భర్తకు ఈ విషయం తెలియాలనే ఆ వీడియోని అతనికి పంపించాను. కానీ ఆమె భర్త మరికొంత మంది ప్రోత్సహించడంతో ఆమె నాపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు ఆరోపణలతో పిర్యాదు చేసింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.
నా చావుకి కారణం అయిన ఆమెతో సహా అందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆమె నాకు పంపిన మెసేజ్‌లు, మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామనేందుకు రుజువులు అన్నీ నా ఐ ఫోన్లో ఉన్నాయి... అని సూసైడ్ లెటర్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నాడు.