తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఈ కేసులో సిట్ అధికారుల ఎదుట హాజరయ్యి వాంగ్మూలం ఇచ్చారు.
అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ, “2023లో నేను పీసీసీ మీడియా ప్రతినిధిగా రేవంత్ రెడ్డితో చాలా సన్నిహితంగా పనిచేశాను. కనుక కేసీఆర్ నా ఫోన్ కూడా ట్యాప్ చేయించారు. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఫోన్, కూతురు కల్వకుంట్ల కవిత ఫోన్ కూడా ట్యాప్ చేయించిన ఘనత కేసీఆర్‌దే. ఆయన హయంలో రాష్ట్రంలో వేలాదిమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అందరి సంభాషణలు రహస్యంగా వినేవారు. హరీష్ రావుకి తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని తెలిసిన తర్వాత అయన తన డ్రైవర్, పీఏని మార్చుకున్నారు,” అని చెప్పారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నవి కొత్త విషయాలు కావు. కేసీఆర్ హయంలో ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన నేరం జరిగిందని చెప్తున్నప్పుడు రెండేళ్ళయినా ఆ కేసు విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోంది? అంటే కేసీఆర్ దోషి అని నిరూపించలేకపోతున్నారా లేదా కేసీఆర్ చెప్తున్నట్లు ఇదంతా రాజకీయ కక్ష సాధింపుకోసం సృష్టించిన ఓ కట్టుకథే అనుకోవాలా?