సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి గ్రామంలోని మల్లిఖార్జున స్వామి తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం. ఆయనని ‘మల్లన్న’గా పిలుచుకుంటూ భక్తితో పూజలు చేస్తుంటారు. మల్లన్నకి మీసాలు ఉన్నందున ‘కొరిమీసాల మల్లన్న స్వామి’ అని కూడా ప్రసిద్ధి చెందారు.
సిద్ధిపేట జిల్లా కేంద్రానికి సుమారు 23 కిమీ దూరంలో ఉన్న కొమురవెల్లి మల్లన్నని దర్శించుకునేందుకు తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యార్ధం కౌమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలనే కోరిక త్వరలో నెరవేరబోతోంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో మాట్లాడి కౌమురవెల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ఒప్పించారు. కిషన్ రెడ్డి స్వయంగా 2024లో ఈ రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
రూ.5.63 కోట్లు వ్యయంతో ‘కౌమురవెల్లి పుణ్యక్షేత్రం’ పేరుతో చక్కటి రైల్వే స్టేషన్ నిర్మింపజేశారు. ఆ ఫోటోలను అయన తెలంగాణ ప్రజలతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని ఆ ఫోటోలు చూస్తేనే అర్ధమవుతోంది. కనుక త్వరలోనే ‘కౌమురవెల్లి పుణ్యక్షేత్రం’ రైల్వే స్టేషన్ ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తేబోతున్నారు.
ఇది అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి భక్తులు నేరుగా ‘కౌమురవెల్లి పుణ్యక్షేత్రం’ చేరుకోవచ్చు. అలాగే ‘కౌమురవెల్లి’ ప్రజలు సికింద్రాబాద్‌కు నేరుగా అక్కడి నుంచే రాకపోకలు సాగించగలుగుతారు.