విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతులు దేవరకొండ స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని తుమ్మనపేట్.
పాన్ ఇండియా నటీనటులుగా గుర్తింపు సంపాదించుకున్న వారిరువురూ పెళ్ళి చేసుకొని తమ గ్రామానికి వచ్చినందుకు గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరూ సంప్రదాయం ప్రకారం ఫామ్‌హౌసులో సత్యనారాయణ వ్రతం చేసుకుని గ్రామస్తులకు మంచి విందు భోజనం పెట్టి పేరుపేరునా పలకరించారు.
సినిమాలలో అందాల ప్రదర్శనకు వెనకాడని రష్మిక చక్కగా పట్టు చీర కట్టుకొని భర్త పక్కన ఒద్దికగా నిలబడటం చూసి గ్రామస్తులు చాలా సంతోషించారు. ఇద్దరినీ మనస్పూర్తిగా ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాకు ఇంత గుర్తింపు, గౌరవం ఇచ్చిన ఈ సమాజానికి తిరిగి కొంత ఇవ్వాలనుకుంటున్నాను.
“దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఏడాది నుంచే తుమ్మనపేట్ హైస్కూల్ 9, 10 తరగతి విద్యార్ధులలో ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ సాధించినవారికి స్కాలర్ షిప్ ఇస్తాము. 2026-27 సం.ల నుంచి అచ్చంపేట పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు స్కాలర్ షిప్ అందిస్తాము,” అని ప్రకటించారు. విజయ్ దేవరకొండ ప్రకటనపై గ్రామస్తులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.