రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు పది రోజులుగా మున్సిపల్ ఎన్నికలకు హోరాహోరీగా ప్రచారం చేశాయి. సోమవారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగిసింది. కనుక ప్రలోభాల పర్వం మొదలైంది. అవి ఆ పనిలో బిజీగా ఉండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు (ఫిభ్రవరి 11) పోలింగ్ నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది.
ఈరోజు ఉదయం నుంచే పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రి తీసుకొని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. మొత్తం 20,000 మంది సిబ్బంది, 25, 000 మంది పోలీసులు ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,1985 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ఏడు కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలకు రేపు పోలింగ్ జరుగబోతోంది. మర్నాడు అవసరమైన చోట్ల రీపోలింగ్ నిర్వహించి, ఫిభ్రవరి 13న ఓట్లు లెక్కింఛి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. దీని కోసం మొత్తం 136 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికలలో గెలిచిన పార్టీల అభ్యర్ధులు ఫిభ్రవరి 16న కార్పోరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు.
రాష్ట్రంలో మొత్తం 52,43,023 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 25,62,369, మహిళలు 26,80,014 మంది, 640 ట్రాన్స్ జండర్స్ ఉన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అత్యధికంగా 3,48,051 భద్రాద్రి కొత్తగూడెం కార్పోరేషన్‌లో అత్యల్పంగా 1,34,655 మంది ఓటర్లున్నారు.