ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, “గతంలో మా ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపడుతున్నప్పుడు, అప్పటి ఏపీ ప్రభుత్వం రైతులతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి స్టే ఉత్తర్వులు సాధించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుని అడ్డుకోవాలనే ఆలోచన లేదు కనుకనే విచారణార్హత కూడా లేనివిధంగా పిటిషన్ వేసింది. దానిని సుప్రీంకోర్టు కొట్టేసింది. రిట్ పిటిషన్ ఉపసంహరించుకొని సివిల్ సూట్ వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అంటే ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగేందుకు గడువు కల్పిస్తోందన్న మాట!
కోర్టులో పంచాయితీలు వద్దు... కూర్చొని మాట్లాడుకుందామని రేవంత్ రెడ్డి చెప్పడం అంటే ఏపీ ప్రభుత్వానికి లొంగిపోవడమే కదా? మన రైతుల ప్రయోజనాల కంటే ఏపీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లే కదా? రేవంత్ రెడ్డి తెలంగాణకు, మన రైతులకు నష్టం కలిగించే ఎటువంటి నిర్ణయం, చర్య తీసుకున్నా అడ్డుకునేందుకు మేము గట్టిగా పోరాడుతాము,” అని హరీష్ రావు హెచ్చరించారు.