తెలంగాణ జిల్లాలను మళ్ళీ శాస్త్రీయంగా పునర్విభజించాలని ప్రభుత్వం నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
సోమవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ఏమన్నారంటే, “ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించేందుకు నాడు కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే, మాది ప్రజా ప్రభుత్వం... మేము చేసేది ప్రజా పాలన అని గొప్పగా చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ జిల్లాలని తగ్గించేసేందుకు కుట్ర చేస్తోంది.
నాడు కేసీఆర్ చాలా లోతుగా అధ్యయనం చేయించిన తర్వాతే 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారు. కొత్త జిల్లాలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశారు. తండాలను పంచాయితీలుగా మార్చారు. ప్రజలకు ఏది అవసరమో గుర్తించి అవన్నీ చేశారు.
కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కోటి రివర్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు తప్ప కొత్తగా చేసిందేమిటి? జిల్లాల పునర్విభజన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము,” అని కేటీఆర్ హెచ్చరించారు.