గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్విభజించారు. అయితే నాడు బీఆర్ఎస్ పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగా ఆశాస్త్రీయంగా విభజించడం వలన సాంకేతికంగా సమస్యలు ఎదురవుతున్నాయి.
కనుక వాటిని సరిచేసేందుకు జిల్లాల శాస్త్రీయ విభజన అవసరమనే అధికారులు, ప్రజా ప్రతినిధులు అభిప్రాయం మేరకు సిఎం రేవంత్ రెడ్డి దీని కోసం జ్యూడిషియల్ కమీషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలున్నందున ఒక్కో నియోజకవర్గం ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అవసరమైతే 20 జిల్లాలు ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంటే 33 జిల్లాలను 17 లేదా 20 జిల్లాలుగా మారే అవకాశం ఉందనుకోవచ్చు.
జ్యూడిషియల్ కమీషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, అందరి అభిప్రాయాలు తెలుసుకొని, రెవెన్యూ, సాంకేతిక ఇతర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేధిక ఇస్తుంది. దాని ఆధారంగా జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరుగుతుంది.
సుప్రీం కోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ఏర్పాటు కాబోయే ఈ కమీషన్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రెవెన్యూ, పంచాయితీ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.