మంత్రికి తెలియకుండా ఇదేం పాలన? హరీష్‌ రావు

January 11, 2026


img

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినీ పరిశ్రమతో, సినిమా టికెట్ ఛార్జీల పెంపుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు తనదైన శైలిలో స్పందించారు.

“ప్రభుత్వంలో ఓ మంత్రికి తెలియకుండా ఆయన శాఖలో ఫైల్స్‌ఫై సంతకాలు, నిర్ణయాలు జరుగుతున్నాయంటే వినడానికి చాలా విచిత్రంగా ఉంది. సంబందిత మంత్రికి తెలియకుండా పాలన సాగించడమే ప్రజా పాలనా?

వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమే అని అన్నందుకు ఓ సినిమాపై కక్ష కట్టి అర్దరాత్రి వరకు టికెట్ ఛార్జీల పెంపుకు జీవో విడుదల చేయకుండా తొక్కి పెడతారు. మరొకరి సినిమాకు రెండు రోజుల ముందుగానే భారీగా టికెట్ ఛార్జీల పెంచుకోవడానికి జీవో విడుదల చేస్తారు. మీకు నచ్చని వాళ్లకు ఒక న్యాయం. నచ్చిన వాళ్లకు మరో న్యాయమా?

నాడు సంధ్య థియేటర్ ఘటన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? ఓ పక్క హైకోర్టు మొట్టి కాయలు వేస్తున్నా మంత్రికి తెలియకుండా జీవోలు విడుదల చేస్తున్నారు. మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారా లేక సర్కస్ కంపెనీయా?

ఈ సినిమా టికెట్ ఛార్జీల వ్యవహారాన్ని నడిపిస్తున్న అదృశ్యశక్తి ఎవరో మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు వారి బండారం బయటపెడతాం,” అంటూ హరీష్‌ రావు హెచ్చరించారు.


Related Post