బీసీ రిజర్వేషన్స్, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో తెలంగాణ ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టుని ఆశ్రయించనున్నది. ఈ రెండింటిపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ నేడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నది.
ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత హైకోర్టు స్టే విధించడం, ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోవడం సరికాదని కనుక స్టే ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని కోరనుంది. రాష్ట్ర జనాభాలో 57.6 శాతం బీసీ జనాభా ఉన్నందునే వారికి 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలనే జీవో జారీ చేశామని సుప్రీంకోర్టుకి తెలియజేయనుంది. బీసీ రిజర్వేషన్స్ పెంపుకి సంబంధించి ప్రభుత్వం పంపించిన బిల్లుని గవర్నర్ 60 రోజులలోగా ఆమోదం తెలుపలేదు కనుక సుప్రీంకోర్టు పాత ఉత్తర్వుల ప్రకారం ఆ బిల్లు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లే అవుతుంది. కనుక బీసీ రిజర్వేషన్స్‌పై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులను కూడా ఎత్తి వేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని అభ్యర్ధించనుంది.
బీసీ రిజర్వేషన్స్ పెంపు రాజ్యాంగంతో ముడిపడిన సున్నితమైన అంశం కనుక సుప్రీంకోర్టు దీనిపై విచారణ వాయిదా వేసి, గతంలో అమలుచేసిన రిజర్వేషన్స్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ముందు అనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్స్ అభ్యర్ధులకు 42 శాతం టికెట్లు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళగలదు. కనుక సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు చాలా కీలకం.