బీసీ రిజర్వేషన్స్‌పై ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కనుక ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయబడింది. హైకోర్టు తదుపరి తదుపరి ఉత్తర్వులకు లోబడి ముందుకు వెళ్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. ఒకవేళ హైకోర్టు బీసీ రిజర్వేషన్స్‌పై స్టే విధించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్ళాలనుకుంది. ఊహించని విధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా హైకోర్టు స్టే విధించింది.
ఈ పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటంతో ప్రభుత్వానికి, పార్టీకి రాజకీయంగా నష్టం కలుగుతోంది. ఈ ప్రభావం త్వరలో జరుగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తప్పక పడితే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. కనుక బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటూనే ఈ పరిణామాలపై పునరాలోచన చేస్తోంది. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ నేడు పిటిషన్ వేసే అవకాశం ఉంది.