జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా నవీన్ యాదవ్ పేరుని అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయన 2014లో జూబ్లీహిల్స్ నుంచే మజ్లీస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా మజ్లీస్ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండటం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటం, నియోజకవర్గంపై మంచి పట్టు ఉండటం వలన నవీన్ యాదవ్‌కు టికెట్ కేటాయించింది.
తనకు టికెట్ కేటాయించినందుకు నవీన్ యాదవ్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికలో తప్పకుండా గెలిచి కాంగ్రెస్ పెద్దల నమ్మకం నిలబెట్టుకుంటానని అన్నారు.
నవీన్ యాదవ్ 2009లో తొలిసారిగా యూసఫ్ గూడా నుంచి మజ్లీస్ అభ్యర్ధిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2014లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లీస్ అభ్యర్ధిగా పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవగలిగారు. 2015లో మళ్ళీ రహ్మత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నిలలో జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి మాగంటి రవీంద్రనాథ్ చేతిలో ఓడిపోయారు. 2023 నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నవీన్ యాదవ్ ఇటీవల సొంతంగా ఓటరు కార్డులు ముద్రించి పంపిణీ చేసినందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయనపై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయగా పోలీసులు ఆయనపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆయన ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది.
జూబ్లీహిల్స్ టికెట్ కోసం మంత్రులు పొన్నం, అడ్లూరి మద్య వివాదం జరిగింది. ఈ నేపధ్యంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్‌కే టికెట్ కేటాయించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ అవరోదాలన్నీ అధిగమించి ఆయన ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం వల్లనే కావచ్చు.
కానీ ఎన్నికల సంఘం పిర్యాదుతో ఒకవేళ పోలీసులు ఆయనపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే అవుతుంది.