బీసీ రిజర్వేషన్స్, స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత బీసీ రిజర్వేషన్స్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్: 9పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా స్టే విధించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. కనుక అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేయక తప్పదు.
ఒకవేళ బీసీ రిజర్వేషన్స్‌పై హైకోర్టు స్టే విధించినట్లయితే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్ళాలనుకుంది. కానీ హైకోర్టు ఎన్నికల ప్రక్రియపై కూడా స్టే విధించడం ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.
ఒకవేళ ఈ వ్యవహారంలో హైకోర్టులో సమస్య ఏర్పడితే సుప్రీంకోర్టుకి రావచ్చని ముందే చెప్పింది కనుక హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్స్ అమలు చేయడంపై అక్కడా సుదీర్గ వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక దానిని పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరవచ్చు. సుప్రీంకోర్టు అనుమతిస్తే ముందు అనుకున్నట్లుగా పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్ళగలదు.