హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన భూమి చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించి హైడ్రా నేడు స్వాధీనం చేసుకుంది. రోడ్ నంబర్ 10లో సర్వే నంబర్: 403లో సుమారు రూ.750 కోట్లు విలువగల 5 ఎకరాల భూమిని పార్ధసారధి అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. దాని చుట్టూ ఫెన్సింగ్ నిర్మించి కాపలాగా బౌన్సర్లను, కాపలాగా వేట కుక్కలను పెట్టాడు. ఆ స్థలం కోసం నకిలీ సర్వే నంబర్ (403/52)తో నకిలీ పత్రాలు కూడా సృష్టించాడు.
అతనిని ఖాళీ చేయించేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తర్వాత హైడ్రాకు పిర్యాదులు చేశారు. పోలీసులు అతనిపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేసినా అతను ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో హైడ్రా రంగప్రవేశం చేసి జేసీబీలతో ఫెన్సింగ్ తొలగించి, ఆ 5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది ప్రభుత్వ స్థలమని తెలియజేస్తూ బోర్డులు పెట్టింది.