గత ప్రభుత్వ హయంలో వరంగల్ జిల్లాలో సంగెం మండలంలో 1,357 ఎకరాలలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసింది. దానిలో దేశ విదేశాలకు చెందిన అనేక కంపెనీలు బట్టల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ‘యంగ్ వన్’ కంపెనీ వాటిలో ఒకటి.
ఈ సంస్థ 120 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మొత్తం 297 ఎకరాలలో 8 యూనిట్స్ ఏర్పాటు చేస్తోంది. ముందుగా 25 మిలియన్ డాలర్లతో ఆరు యూనిట్స్ నిర్మిస్తోంది.
వాటిలో మొదటి ప్లాంట్ నిర్మాణం పూర్తవడంతో ఇటీవలే టీ షర్ట్స్ తయారీ ప్రారంభించింది. తొలిదశ ప్రాజెక్టులోనే 200 మంది స్థానికులు పనిచేస్తున్నారు. వారిలో 90 శాతం మహిళలే ఉన్నారు. ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం నెలకు 10 నుంచి 15,000 టీ షర్ట్స్ తయారు చేసి ‘మేడిన్ తెలంగాణ, ఇండియా’ అని ముద్రించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
రాబోయే మూడు నెలల్లో మరో మూడు ప్లాంట్స్, ఆ తర్వాత మరో రెండేళ్ళలో మిగిలిన ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చి ఉత్పత్తి ప్రారంభం అయితే మొత్తం 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించగలమని యంగ్ వన్ ఇండియా డైరెక్టర్ అండ్ హెడ్ శ్రీకాంత్ ఎస్ భమిడిపాటి చెప్పారు.
మిగిలిన ప్లాంట్స్ అందుబాటులోకి వస్తే పురుషులు, మహిళలు, పిల్లలకు జీన్ ప్యాంట్స్, జాగింగ్ తదితర స్పోర్ట్స్ డ్రెస్‌లు, యోగా దుస్తులు, వింటర్ జాకెట్స్, స్వెట్టర్లు ఇంకా అనేక రకాల దుస్తులు తయారు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ తయారవుతున్న టీ షర్ట్స్ 100 శాతం విదేశాలకే ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాలలో యువతకు అవసరమైన శిక్షణ కూడా ఇచ్చి ఉద్యోగాలలో తీసుకుంటున్నామని చెప్పారు.
తమ ప్లాంట్‌లో సాధారణ కార్మికులు, టైలరింగ్‌లో కట్టర్స్, కుట్టుపనివారు, సూపర్ వైజర్లు, డ్రెస్ డిజైనర్స్, క్వాలిటీ కంట్రోల్, అకౌంట్స్, హెచ్ఆర్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ తదితర రంగాలలో అనుభవం ఉన్నవారిని భారీగా నియమించుకోబోతున్నామని తెలిపారు.
కనుక ఆసక్తి, అనుభవం, తగిన అర్హతలు కలిగినవారు పూర్తి వివరాలు, దరఖాస్తులతో తమని సంప్రదించవచ్చని తెలిపారు.