శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి ప్రతీరోజూ అనేక జాతీయ, అంతర్జాతీయ విమానాలు వచ్చి వెళుతుంటాయి. కనుక ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్’ అనే కంపెనీ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది.
ప్రధాని మోడీ నేడు ఢిల్లీ నుంచి ఈ కంపెనీని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, “భారత్ అవసరాలకు 1500 విమానాలు ఆర్డర్ పెట్టాము. కనుక వాటి ఇంజిన్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పటు కావడం మంచి వెసులుబాటు కల్పిస్తుంది. ఈ రంగంలో నూటికి నూరు శాతం చిన్న పరిశ్రమలతో పాటు విదేశీ పెట్టుబడులను కూడా అనుమతిస్తున్నాము,” అని చెప్పారు.
ఫ్రెంచ్ కంపెనీ తమ ఈ ఇంజన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటుకి హైదరాబాద్‌ని ఎంచుకున్నందుకు సిఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పడినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఏరో స్పేస్, సివిల్ ఏవియేషన్ హబ్ ఉందని, ఇప్పుడు శఫ్రాన్ కూడా రావడంతో ఈ రంగంలో నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడుతుందన్నారు.