ఏపీ, తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘వందే భారత్ స్లీపర్ ట్రైన్స్’ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఒకటి సికింద్రాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి, మరొకటి విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రెండు రైళ్ళు తయారై సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ రూట్ కూడా ఖరారు చేశారు. కనుక త్వరలోనే ఇవి ప్రారంభం కానున్నాయి.
సికింద్రాబాద్-ఢిల్లీ మద్య 1,667 కిమీ దూరం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 20 గంటలలో గమ్యం చేరుకోవచ్చు. ఒక్కో వందే భారత్ స్లీపర్ రైలులో 11 థర్డ్ ఏసి, 4 సెకండ్ ఏసి, ఒక ఫస్ట్ ఏసి బోగీలు ఉంటాయి. ఈ రైలు సికింద్రాబాద్- కాజిపట్ జంక్షన్-బల్హర్షా- నాగ్‌పూర్-ఇటార్సి-భోపాల్- వీరాంగన లక్ష్మీ బాయి ఝాన్సీ- గ్వాలియర్-ఆగ్రా మీదుగా ఢిల్లీ చేరుకుంటుంది.
దీనిలో ఫస్ట్ ఏసి ఛార్జీ సుమారు రూ.6,000, సెకండ్ ఏసి రూ.4,800, థర్డ్ ఏసి రూ.3,600 ఉండవచ్చని సమాచారం. ఈ రైలు వారంలో 5 లేదా ఆరు రోజులు ఢిల్లీ నుండి రాత్రి 8:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 8:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకునేలా టైమింగ్ ప్లాన్ చేస్తున్నారు.
ఏపీలో విజయవాడ నుంచి బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన తర్వాత, వరంగల్, కాజీపేట మీదుగా అయోధ్య, వారణాశిలకు వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ కేటాయించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఇవి ప్రారంభం కావచ్చు.