బీసీ రిజర్వేషన్స్‌పై హైకోర్టుకే వెళ్ళండి: సుప్రీం కోర్టు

October 07, 2025


img

ముందే చెప్పుకున్నట్లుగా తెలంగాణ బీసీరిజర్వేషన్స్‌ జీవోపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. 

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ద్విసభ్య ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, దీనిపై రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌ కొట్టివేసింది. రేపు (బుధవారం) హైకోర్టు ఈ కేసుపై విచారణ జరుపనుంది. 

బీసీ రిజర్వేషన్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అభ్యంతరం తెలుపుతూ సోమవారం హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. వికారాబాద్‌ జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన మడివాల మచ్చదేవ, ఎన్‌ లక్ష్మయ్య, మరో వ్యక్తి కలిసి ఈ పిటిషన్‌ వేశారు. 

పంచాయితీ రాజ్ చట్టంలో సెక్షన్ 9(4) ప్రకారం జీవోలో బీసీలను ఏ,బీ,సీ,డీ వర్గాలుగా విభజించక పోవడం వలన బీసీలలో కొన్ని వర్గాలకు మాత్రమే ఈ రిజర్వేషన్స్‌ ప్రయోజనం కలుగుతుందని, కనుక జీవోలో ఈ మార్పు చేసే వరకు దానిని అమలు చేయకుండా నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. 

అలాగే బీసీ రిజర్వేషన్స్‌ని సమర్ధిస్తూ మరికొందరు ఇంప్లీడ్ పిటిషన్స్ వేశారు. బీసీ రిజర్వేషన్స్‌పై అభ్యతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్స్ విచారణలో తమ వాదనలు కూడా వినాలని వారు హైకోర్టుని అభ్యర్ధించారు.


Related Post