హైదరాబాద్‌లో సిటీ బస్సు ఛార్జీలు పెంపు

October 05, 2025
img

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అన్ని రకాల సిటీ బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 

సిటీ ఆర్డినరీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎలక్ట్రిక్ బస్సులలో మొదటి మూడు స్టేజీలకు రూ.5 చొప్పున, నాలుగో స్టేజి నుంచి చివరి స్టేజి వరకు రూ.10 ఛార్జీలు పెంచింది. 

మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్-మెట్రో ఏసీ బస్సులలో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజి నుంచి చివరి స్టేజి వరకు రూ.10 ఛార్జీలు పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. పెంచిన ఛార్జీలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.    

ప్రస్తుతం నగరంలో 25 డిపోలలో 265 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. వచ్చే ఏడాది మరో 275 బస్సులు రాబోతున్నాయి. వీటన్నిటికి ఒక్కో డిపోలో విద్యుత్‌ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రూ.8 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఆరు డిపోలలో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. 

నగరంలో కొత్తగా మరో 10 డిపోలు ఏర్పాటు కాబోతున్నాయి. కొత్త డిపోలు ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనా, 29 డిపోలలో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.392 కోట్లు అవసరం. 

ప్రభుత్వంపై ఇప్పటికే మహాలక్ష్మి పధకం భారం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం, టీజీఎస్ ఆర్టీసీ రెండూ కూడా ఇంత భారం భరించలేవు. కనుక నగరం సిటీ బస్సు ఛార్జీలు పెంచక తప్పడం లేదని టీజీఎస్ ఆర్టీసీ వివరించింది. 

Related Post