జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న మంటలు చూస్తున్నప్పుడు, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనే నానుడి గుర్తుకు రాకమానదు.
ఇది ముందే ఊహించిన సిఎం రేవంత్ రెడ్డి మహమ్మద్ అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ సీటు ఇప్పించి ఈ పోటీ నుంచి తప్పించారు. కానీ జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. వారిలో సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒకరు.
కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందుకు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆయనాపై అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన సోదరుడు మల్లు రవి ఇలా ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది ఉన్నారు కదా?
కానీ నా కొడుకు ఎంపీగా ఉన్నాడు కనుక నాకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వకూడదని చెప్పడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరు? పార్టీలో ఆయన కంటే నేనే సీనియర్. నాకు టికెట్ ఇవ్వాలో వద్దో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది కానీ ఆయన కాదు,” అని అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.