బీసీ రిజర్వేషన్స్‌: సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌

October 04, 2025


img

త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతల పల్లి మండలంలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి ఈ పిటిషన్‌ వేశారు. దీనిపై ఈ నెల 8న హైకోర్టు విచారణ జరుపనుంది.

ఈలోగా నేడు వంగా గోపాల్ రెడ్డి అనే మరో వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. 

సుప్రీం కోర్టు పాత తీర్పుల ప్రకారం అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. కానీ తెలంగాణ ప్రభుత్వం బీసీలకే 42 శాతం రిజర్వేషన్స్‌ కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఆ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతోంది.

ఇది రాజ్యాంగ విరుద్దం కనుక బీసీ రిజర్వేషన్స్‌ పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేయాలని వ్యంగ్య గోపా రెడ్డి తన పిటిషన్‌లో సుప్రీం కోర్టుని అభ్యర్ధించారు. 

కానీ ఇప్పటికే దీనికి సంబందించి హైకోర్టులో ఓ పిటిషన్ ఉంది. ఈ నెల 8న విచారణ జరుగబోతోంది. కనుక అక్కడే తేల్చుకోమని సుప్రీం కోర్టు సూచించే అవకాశం ఉంది. 

ఒకవేళ హైకోర్టు, సుప్రీం కోర్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ పెంపు చెల్లదని తీర్పు చెప్పినట్లయితే, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Related Post