ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఇదివరకు కాంగ్రెస్, బీజేపి రెండు పార్టీలకు పని చేశారు. ఇప్పుడు బీహార్ శాసనసభ ఎన్నికలలో ఆ రెండు పార్టీలతోనే యుద్ధం చేస్తున్నారు. ఆయన ‘జన సూరజ్’ పార్టీతో బీహార్ ఎన్నికలలో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.
ఇతర పార్టీలను గెలిపించడం, సొంతంగా పార్టీ పెట్టుకొని దానిని గెలిపించుకోవడం రెండింటికీ చాలా తేడా ఉండనే విషయం ప్రశాంత్ కిషోర్‌కి చాలా ఆలశ్యంగా జ్ఞానోదయం అయినట్లుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంట్’తో రాజకీయాలు చేస్తున్నట్లు ఆయన కూడా ‘బిహారీ సెంటిమెంటు’తో రాజకీయాలు చేస్తున్నారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కొన్ని వారాల క్రితం బీహార్‌లో రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి బిహారీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, కనుక అలాంటి వ్యక్తిని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో బిహారీల పట్ల చులకనగా మాట్లాడిన రేవంత్ రెడ్డిని తాను తప్పకుండా గద్దె దించుతానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కానీ రేపు బీహార్ ఎన్నికలలో జన సూరజ్ పార్టీ ఓడిపోతే తన పరిస్థితి ఏమిటి? అని ప్రశాంత్ కిషోర్ ఆలోచించినట్లే లేదు.