నకిలీ ట్రేడింగ్ యాప్‌తో 12 లక్షలు కుచ్చు టోపీ!

September 16, 2025
img

ఒక సైబర్ నేరం గురించి అర్ధం చేసుకొని అప్రమత్తం అయ్యేలోగానే మరో కొత్త రకం మోసం జరుగుతోంది. వీటి పట్ల అవగాహన లేని సామాన్య ప్రజలు ఈ సైబర్ నేరగాళ్ళ బారినపడి వారి జీవితకాల కష్టార్జితమంతా ఒక్క క్షణంలో పోగొట్టు కుంటున్నారు. కొంతమంది అప్పులు చేసి మరీ తెచ్చి పెట్టి మరీ మోసపోతున్నారు. 

ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు, మద్యతరగతి ప్రజలు! 

సులువుగా డబ్బు సంపాదించవచ్చనే వారి ఆశ, కానీ అవగాహనరాహిత్యమే వారిని సులువుగా మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్ళకు అవకాశం కల్పిస్తోంది. 

తిరుపతిలో ఇటువంటి సైబర్ నేరమే జరిగింది. హేమాంగి దత్ అనే ఓ సైబర్ నేరగాడు తిరుపతిలోని ఓ యోగా టీచర్‌కి తాను యోగా మాస్టారుగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. తర్వాత మెల్లగా స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుతూ వాటిలో పెట్టుబడి పెడితే సులువుగా సొమ్ము రెట్టింపవుతుందని నమ్మకం కలిగించాడు.  

సదరు సైబర్ నేరగాడు ముందుగానే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేరుతో ఓ నకిలీ ట్రేడింగ్ యాప్ సృష్టించాడు. దానిలో తాను సూచించిన షేర్లను కొంటే మంచి లాభాలు వస్తాయని నమ్మించి యోగా టీచర్ చేత పెట్టుబడి పెట్టించే వాడు. 

ఆ ట్రేడింగ్ యాప్ అతను సృష్టించిందే కనుక యోగా టీచర్‌కి నమ్మకం కలిగించేందుకు అప్పుడప్పుడు భారీగా లాభాలు వచ్చినట్లు చూపుతుండేవాడు. వాటిని చూసి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ లాభాల లెక్కలన్నీ నిజమే అనుకుంటూ యోగా టీచర్ క్రమక్రమంగా రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టారు. 

ఇటీవల డబ్బు అవసరమై వాటిలో కొన్ని షేర్స్ అమ్మేసి డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తే రూ.20,000 బ్రోకరేజ్ కమీషన్ చెల్లించాలని మెసేజ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి ఐసీఐసీఐ బ్యాంకుకి వెళ్ళి ఆర్ఆ తీయగా, అసలు ఆ పేరుతో తమ బ్యాంకుకు ఎటువంటి ట్రేడింగ్ యాప్ లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ యోగా టీచర్ లబోదిబోమంటూ సైబర్ పోలీసుల దగ్గరకు పరిగెత్తాడు.

Related Post