హైదరాబాద్, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విశ్వవిద్యాలయం ఆవరణలో గల బొటానికల్ గార్డెన్‌లోకి సుమారు డజను జేసీబీలతో అనేక చెట్లని కూల్చేశారు. వెంటనే విద్యార్ధులు అక్కడకు పరుగున వచ్చి వారిని అడ్డుకోబోయారు. కానీ అప్పటికే సిద్దంగా ఉన్న పోలీసులు విద్యార్ధులను అడ్డుకున్నారు.
అనేక సంవత్సరాల వయసున్న భారీ చెట్లను ఎందుకు కూల్చివేస్తున్నారంటూ విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేయగా రేపు సిఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవంలో భాగంగా అక్కడ మొక్కలు నాటడానికి వస్తున్నారని పోలీస్ అధికారులు చెప్పడంతో వారు షాక్ అయ్యారు. వన మహోత్సవం అయితే మొక్కలు నాటాలి కానీ పెద్ద చెట్లను కూల్చేసి మొక్కలు నాటడం ఏమిటని విద్యార్ధులు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్ధులకు మద్య వాగ్వాదాలు జరిగాయి. కానీ ఆలోగానే అనేక చెట్లను జేసీబీలతో కూల్చేయడంతో విద్యార్ధులు ఆగ్రహంతో రగిలిపోతూ నినాదాలు చేశారు. కానీ పోలీసుల రక్షణలో చెట్ల తొలగింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత జేసీబీలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి.
ఈ ఘటనపై యూనివర్సిటీ వైస్ ఛాన్సీలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. గత 30 ఏళ్ళుగా ఆ ప్రాంతంలో పనికిరాని మొక్కలు, తుప్పలు పెరిగిపోయాయి. వాటిలో సుబాబులు, యూకలిప్టస్ చెట్లు కూడా ఉన్నాయి.
కనుక వన మహోత్సవం కొరకు 20 ఎకరాలలో విస్తరించిన ఆ చెట్లను తొలగించాము. మిగిలిన 150 ఎకరాలలో కూడా పెరిగిన సుబాబులు, యూకలిప్టస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో తెలంగాణ సాంప్రదాయ, ఔషదా గుణాలున్న మొక్కలను నాటి పెంచుతాము. చెట్లను తొలగించడానికి టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఖరారు చేశాము. ఆ టెండర్లు దక్కించుకున్న టింబర్ డిపోలవారే నిన్న రాత్రి ఆ చెట్లను తొలగించారు,” అని పేర్కొన్నారు.