రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో 11 గ్రామాలు మిడ్ మానేరు జలాశయంలో ముంపుకు గురయ్యాయి. కనుక అప్పటి ప్రభుత్వం వారందరికీ నష్టపరిహారం చెల్లించి గ్రామాలు ఖాళీ చేయించింది. వాటిలో కొదురుపాక గ్రామం కూడా ఒకటి.
ఇంతకాలం ఆ గ్రామం జలాశయంలో మునిగి ఉంది. ఇప్పుడు నీటి మట్టం తగ్గడంతో ఆ గ్రామంలో శిధిలావస్థలో ఉన్న ఇళ్ళు, చెక్కు చెదరకుండా ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలు బయటపడ్డాయి.
ఇతర ప్రాంతాలకు తరలిపోయిన కొదురుపాక గ్రామస్తులు ఈ విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని శిధిలావస్థలో ఉన్న తమ ఇళ్ళని, ఆలయాలను చూసి తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.
తరతరాలుగా తాము ఇక్కడే నివశించామని, కానీ మిడ్ మానేరు జలాశయం కోసం తమని ప్రభుత్వం గ్రామాలు ఖాళీ చేయించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇంత కాలం తర్వాత తమ ఇళ్ళు, ఆలయాలు పైకి తేలడంతో కొంత మంది యువకులు ఆనందం పట్టలేక నీళ్ళలో ఈదుకుంటూ వాటి దగ్గరకు వెళ్ళి చూసి వస్తున్నారు.