ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ పార్టీలో పలువురు సీనియర్లు మంత్రి పదవులకు పోటీ పడుతున్నారు.
ఒకవేళ తమకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి రాజైనమ చేస్తామని బెదిరిస్తున్నారు కూడా. కనుక మంత్రివర్గ విస్తరణ చేసి కొత్త సమస్యలు సృష్టించుకోవడం కంటే చేయకుండా ఉండటమే మంచిదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుంది.
మంత్రివర్గ విస్తరణ చేయనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం పోటీలు పడుతున్నవారి మద్య యుద్ధాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “అన్నకు మంత్రి పదవి ఇస్తే తమ్ముడికి ఇవ్వకూడదని ఎక్కడైనా రూల్ ఉందా?సమర్ధతని బట్టే మంత్రి పదవులు ఇవ్వాలి తప్ప ఇటువంటి వాటిని పరిగణించకూడదు.
నాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. కానీ జిల్లాకే చెందిన సీనియర్ నాయకుడు కే జానారెడ్డి ధర్మరాజులా నాకు సాయపడతారనుకుంటే ధృతరాష్ట్రుడిలా అడ్డు పడుతున్నారు. తనకి కూడా మంత్రి పదవి కావాలంటూ అడ్డుపుల్లలు వేస్తున్నారు.
ఆయన 25 ఏళ్ళ పాటు మంత్రిగా ఉన్నారు. ఇంకా ఎన్నిసార్లు మంత్రి పదవి ఇవ్వాలి? అవసరం ఏమిటి?నేను ఏనాడూ మంత్రి పదవి కోసం అడుక్కోలేదు. కానీ ఇస్తే తప్పకుండా తీసుకొని నా సమర్ధత నిరూపించుకుంటాను,” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.