ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాల చివరి రోజున జరిగిన చర్చలో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపి నేతలు గొప్పగా చెప్పుకుంటున్న ‘డబుల్ ఇంజన్ సర్కార్’ గురించి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.
“ప్రాజెక్టుల విషయంలో, బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మేము వాదిస్తూనే ఉన్నాము. బీజేపి పెద్దలు చెపుతున్న ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రకారం రాష్ట్రంలో బీజేపి అధికారంలో లేనందున నిధులు కేటాయించడం లేదని స్పష్టం అవుతోంది కదా?
బీజేపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఉదారంగా నిధులు విడుదల చేస్తామని, లేని రాష్ట్రాలను పట్టించుకోమని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే ఉందిది. మనది ఫెడరల్ వ్యవస్థ. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం. కనుక దేశాన్ని పాలిస్తున్న పెద్దలు అన్ని రాష్ట్రాలను సమానంగా పరిగణించకుండా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇచ్చుకుంటామంటే ఎలా?
బీజేపి పెద్దలు గొప్పగా చెప్పుకుంటున్న ‘డబుల్ ఇంజన్ సర్కార్’ గురించి ఎవరూ ఇలా ప్రశ్నించకపోవడం వలననే కేంద్రం ధైర్యంగా ఈ విధానం అమలుచేస్తున్నామని బాహాటంగా చెప్పుకుంటోంది,” అని కేటీఆర్ అన్నారు.