సంక్రాంతి వస్తోంది... హైదరాబాద్‌ ఖాళీ అయిపోతోంది

January 11, 2025


img

నిత్యం ప్రజలు, వాహనాలతో కిటకిటలాడే హైదరాబాద్‌ నగరం ఏటా సంక్రాంతి పండుగ వస్తే ఒక్కసారిగా బోసిపోతుంటుంది. ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలమంది తమ సొంత ఊర్లలో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు రైళ్ళు, బస్సులు, విమానాలు, సొంత వాహనాలలో బయలుదేరుతుంటారు. 

ఐటి ఉద్యోగులకు శని,ఆదివారాలు సెలవులుంటాయి. నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు మొదలవడంతో, శుక్రవారం సాయంత్రం నుంచే వేలాది మంది ఏపీకి బయలుదేరారు. 

సంక్రాంతికి ఎన్ని ప్రత్యేక రైళ్ళు, బస్సులు వేసినా అన్నీ నిండిపోయాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కనుక వేలాదిమంది సొంత వాహనాలలో ఊర్లకు బయలుదేరుతున్నారు. దీంతో హైదరాబాద్‌- విజయవాడ మద్య జాతీయ రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. 

మొత్తం 16 టోల్ గేట్లు ఉండగా రద్దీని దృష్టిలో ఉంచుకొని వాటిలో 12 గేట్లను తెరిచారు. ఒక్కో గేటు గుండా సగటున ప్రతీ నాలుగు సెకన్లకు ఒకటి చొప్పున గంటకు సుమారు 900 వాహనాలు విజయవాడ వైపు దూసుకుపోతున్నాయి. 

ఈరోజు (శనివారం) ఉదయం నుంచి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ చాలా పెరిగిపోయింది. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి వద్ద పతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో అదనంగా మరో డజను మంది ట్రాఫిక్ పోలీసులను మోహరించవలసి వచ్చింది. 

ఈ నెల 14న సంక్రాంతి, తర్వాత కనుమ, ముక్కనుమ పండుగలు మూడూ ముఖ్యమే కనుక అంతవరకు ఈ రద్దీ ఉంటుంది. మళ్ళీ పండుగ ముగిసిన తర్వాత అందరూ ఒకేసారి తిరుగు ప్రయాణం అవుతారు కనుక మళ్ళీ టోల్ ప్లాజాల వద్ద రద్దీ మొదలవుతుంది.


Related Post