తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్ళి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. తర్వాత సిఎం రేవంత్ రెడ్డి ఆలయ అధికారులతో కాసేపు మాట్లాడి ఆలయ గోపురానికి బంగారు తాపటం పనులు, కొండపై భక్తులకు వసతుల గురించి చర్చించారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు సంగెం చేరుకొని అక్కడి నుండి మూసీ కుడివైపు ఒడ్డున భీమలింగం వరకు సుమారు2.5 కిమీ పాదయాత్ర చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నాగిరెడ్డిపల్లిలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు.
సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో మూసీ పరీవాహక ప్రాంతాలలో పర్యటిస్తారనుకుంటే నల్గొండలో పర్యటిస్తుండటాన్ని హరీష్ రావు ఆక్షేపిస్తున్నారు. హైదరాబాద్‌లో మూసీ బాధితులని పరామర్శించేందుకు సిఎం రేవంత్ రెడ్డికి ధైర్యం లేకనే వేరే చోట పర్యటించి ‘మమ’ అనిపిస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. వారిలో కేటీఆర్ కూడా ఒకరు.
సిఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, తాను హైదరాబాద్‌లో తన ఇంట్లోనే ఉన్నానని, ఒకవేళ ఏసీబీ అధికారులను పంపిస్తే వారికి కూడా చాయ్, బిస్కట్లు ఇచ్చి బర్త్ డే కేక్ కూడా కట్ చేయిస్తానని కేటీఆర్ అన్నారు.