ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. వెకేషన్ బెంచ్ ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయగా దానిపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వెలువడేవరకు వెకేషన్ బెంచ్ తీర్పుని అమలుచేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ ఆయనకు లక్ష రూపాయల పూచీకత్తుతో గురువారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. అప్పుడే ఈడీ దానిని వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించింది. కనీసం తాము హైకోర్టులో అప్పీలు చేసుకునే వరకు ఆయన బెయిల్ ఇవ్వకుండా నిలిపి ఉంచాలని ఈడీ అభ్యర్ధించింది. కానీ వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి న్యాయ్ బిందు దాని వాదనలను తిరస్కరించి అర్వింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు.
దీంతో ఈడీ వెంటనే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి అర్వింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులని నిలిపివేయాలని కోరింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడంతో అర్వింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించినప్పటికీ జైలు నుంచి బయటకు రాలేకపోయారు.
నేడు ఢిల్లీ హైకోర్టు ఆయన బెయిల్ కేసుపై విచారణ జరుపబోతోంది. కనుక హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సమర్ధిస్తుందా లేదా అనే విషయం ఈరోజు సాయంత్రంలోగా తెలియవచ్చు.