హైదరాబాద్‌ పబ్‌లు: మారేదేలే!

May 05, 2024


img

హైదరాబాద్‌ నగరంలో పబ్‌లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసి ఎంతమందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నా, ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. మద్యం, మాదకద్రవ్యాలు, అశ్లీల నృత్య ప్రదర్శనలు... ఒకటేమిటి అన్ని అవలక్షణాలతో హైదరాబాద్‌ పబ్‌లు నిరాటంకంగా నడుస్తూనే ఉన్నాయి. 

శనివారం రాత్రి పోలీసులు బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 14లోగల ‘ఆఫ్టర్ 9’ పబ్‌ మీద దాడిచేశారు. పబ్‌కు వచ్చే  కస్టమర్లను సంతోషపరిచేందుకు పబ్ యాజమాన్యం ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తోంది. పోలీసులు పబ్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న 40 మంది యువతులతో పాటు మొత్తం 160 మందిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

పబ్ నిర్వాహకులతో పాటు వారందరిపై కేసులు నమోదు చేసి, యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లితండ్రులకు అప్పగించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతులను రెస్క్యూ  హోమ్‌కు తరలించారు.

పబ్‌లో మాదక ద్రవ్యాలు కూడా వినియోగిస్తున్నారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు తేలితే సంబందిత సెక్షన్స్ ప్రకారం కూడా వేరేగా కేసులు నమోదు చేస్తామని బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. 


Related Post