దేశానికి స్వాతంత్ర్యం..తెలంగాణ ఏర్పాటు ఘనత కాంగ్రెస్‌దే

September 18, 2021


img

తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాసభ జరిగింది. ఈ సభకు కాంగ్రెస్‌ అధిష్టానం తరపున ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ మాణికం ఠాకూర్‌, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, సీతక్క తదితరులు ఈ సభకు హాజరయ్యారు. సుమారు లక్ష మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరవడంతో సభ విజయవంతమైంది. 

ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయే. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం కానీ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. దళిత,గిరిజనుల హక్కుల కోసం పోరాటంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు ఈరోజు ఇంతమంది హాజరవడం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేస్తాం,” అని అన్నారు. 

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఎప్పటిలాగే సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల మీద తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి కౌంట్ డౌన్‌ మొదలైందని అన్నారు. దామోదర రాజనర్సింహ ఈ ఏడేళ్ళ తెలంగాణ ప్రభుత్వ పాలనపై 15 అంశాలతో పీపుల్స్ ఛార్జ్-షీట్ పేరిట సభలో ప్రవేశపెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. భట్టి విక్రమార్క, సీతక్క తదితరులు కూడా టిఆర్ఎస్‌ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలు, హామీల అమలులో నిర్లక్ష్యం, అవినీతి, రాష్ట్రంలో దళిత, గిరిజన హక్కులు తదితర అంశాల గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు. Related Post