మొన్న అమూల్య...నిన్న ఆద్ర...అరెస్ట్

February 22, 2020


img

రెండు రోజుల క్రితం బెంగళూరులో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ వేదికపై నుంచి నినాదాలు చేసిన అమూల్య లియోన్ అనే 22 ఏళ్ళ యువతిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుపై జైల్లో పెట్టారు. అది జరిగి 24 గంటలుకాక మునుపే బెంగళూరులోనే మళ్ళీ అటువంటి మరో ఘటన జరిగింది. 

కొన్ని కన్నడ ప్రజాసంస్థలు సీఏఏను వ్యతిరేకిస్తూ బెంగళూరులో టౌన్ హాల్లో శుక్రవారం ఓ సమావేశం ఏర్పాటు చేసుకొన్నాయి. దానికి హాజరైన ఆద్ర అనే యువతి కశ్మీర్‌కు స్వాతంత్రం ఇవ్వాలని కోరుతూ ప్లకార్డు ప్రదర్శించడంతో మళ్ళీ కలకలం రేగింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దేశంలో ముస్లింలు, దళితులు, కశ్మీరీలు, బహుజనులు, ఆదివాసీలు, హిజ్రాలకు స్వేచ్చా స్వాతంత్ర్యాలు కల్పించాలని వ్రాసి ఉన్న ప్లకార్డును ఆమె ప్రదర్శించింది. ప్లకార్డులో కశ్మీరీలకు స్వేచ్చా స్వాతంత్ర్యాలు కల్పించాలనేది అభ్యంతరకరంగా ఉండటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 

ఆమె, అమూల్య లియోన్ ఇద్దరూ స్నేహితులని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ అమూల్య ఎవరో తనకు తెలియదని ఆద్ర చెప్పింది. తాను బెంగళూరులోని మల్లేశ్వరంలో ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నానని తెలిపింది. ఆమెపై సెక్షన్స్ 153ఏ2, 153బి కింద కేసులు నమోదు చేసినట్లు బెంగళూరు సెంట్రల్ డీసీపి చేతన్ సింగ్ రాథోడ్ తెలిపారు.


Related Post