ఆరోగ్యశ్రీని తెల్ల రేషన్ కార్డులతో ముడి పెట్టొద్దు

July 16, 2024
img

సిఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి వారికి అనేక విలువైన సూచనలు చేశారు. వాటిలో ఆరోగ్యశ్రీని తెల్ల రేషన్ కార్డులతో ముడి పెట్టొద్దనేది ఒకటి. రాష్ట్రంలో అర్హులందరికీ ఆరోగ్యశ్రీ అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరివీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి నిర్వహించాలని సూచించారు. 

రాష్ట్రంలో వేలమంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఉన్నారని, వారందరికీ అవసరమైన శిక్షణ ఇచ్చి వారి సేవలను ఉపయోగించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు, విధివిధానాలు సిద్దం చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. మారుమూల గ్రామాలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందేలా కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండే బెడ్లకు సీరియల్ నంబర్ కేటాయించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులన్నిటి నిర్వహణ కొరకు ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళిక, నివేదిక సిద్దం చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. 

వైద్య చికిత్సలు, పరీక్షలకు అయ్యే ఖర్చులు భరించలేక రాష్ట్రంలో లక్షలాదిమంది పేద, మద్యతరగతి ప్రజలు తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతూ భారంగా జీవితాలు గడుపుతున్నారు. తెల్ల రేషన్ కార్డులతో ముడిపెట్టకుండా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించాలనే సిఎం రేవంత్‌ రెడ్డి సూచన అమలుచేసిన్నట్లయితే వారందరికీ ఎంతో మేలు చేకూరుతుంది. 

Related Post