పవన్ ఎఫెక్ట్: జిల్లాలో మంత్రి పర్యటన

January 06, 2017


img

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితం హటాత్తుగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి అక్కడి  ఉద్దానం తదితర మండలాలో కిడ్నీ బాధితులను కలిసి మాట్లాడారు. గత మూడు దశాబ్దాలుగా సుమారు 104 గ్రామాలలో ప్రజలు కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఈ సమస్య పరిష్కరించడానికి తెదేపా ప్రభుత్వం రెండు వారాలలోగా చర్యలు చేపట్టకపోతే ఉద్యమం మొదలుపెడతానని హెచ్చరించారు. 48గంటలలో రూ.100 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. ఆయన హెచ్చరికలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడిపోలేదు. 100 కోట్లు విడుదల చేయలేదు కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డా.కామినేని శ్రీనివాస్ ని తక్షణమే అక్కడికి పంపించి పవన్ కళ్యాణ్ కోరినట్లుగా ఆ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టమని ఆదేశించారు. 

మంత్రి కామినేని నిన్న శ్రీకాకుళంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించి ఆ సమస్య గురించి చర్చించిన తరువాత, మీడియాతో మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్లుగా 100 కోట్లు విడుదల చేసినట్లయితే ఈ సమస్య శాస్వితంగా పరిష్కారం అయిపోతుందంటే ప్రభుత్వం అందుకు సిద్దంగా ఉంది. గతంలో అనేక మంది శాస్త్రజ్ఞలు, నిపుణులైన వైద్యులు ఇక్కడ చాలా పరిశోధనలు చేశాఋ. కానీ ఎవరూ దానికి కారణాలు కనిపెట్టలేకపోయారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఈ కిడ్నీ వ్యాదులకు సంబందించిన ఐదుగురు వైద్య నిపుణులు, ఇక్కడి నీరు, మట్టి నమూనాలను పరీక్షలు చేసేందుకు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఇద్దరు శాస్త్రజ్ఞులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటుచేస్తాం. వారందరూ త్వరలోనే ఇక్కడి గ్రామాలలో పర్యటించి ఈ కిడ్నీ వ్యాధులు రావడానికి గల కారణాలను కనుగొనే ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాధికి గురైన వారికి అందించవలసిన చికిత్సా సౌకర్యాల గురించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. దానిని బట్టి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది. ముందుగా జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తాము. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సమస్య తీవ్రతను గుర్తించి, అన్ని గ్రామాలలో మంచి నీటిని అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు కానీ ఆ తరువాత రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేయడం వలన జిల్లాలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు,” అని మంత్రి కామినేని చెప్పారు. 

జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు, హెచ్చరికలు చేసినా పట్టించుకొని తెదేపా సర్కార్, పవన్ కళ్యాణ్ ఒక్కసారి హెచ్చరించగానే ఉరుకుల పరుగుల మీద జిల్లాకు మంత్రిని పంపించి ఈ ప్రకటన చేయించడం విశేషమే. బహుశః వచ్చే ఎన్నికలలో కూడా తెదేపాకు పవన్ కళ్యాణ్ మద్దతు కొనసాగాలని ఆశిస్తున్నందునే స్పందిస్తున్నట్లుంది. కానీ పవన్ కళ్యాణ్ తెదేపా పాలనపై, దాని అవినీతిపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పైగా వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని పదేపదే చెపుతున్నారు కూడా. అయినప్పటికీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశలు వదులుకోలేదని స్పష్టం అవుతోంది. 


Related Post