మోడీ క్రెడిట్ కాస్తా డెబిట్ గా మారిపోనుందా?

December 12, 2016


img

భారత్ ఆర్మీ పాక్ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసి అక్కడి తీవ్రవాదులని, వారి స్థావరాలని మట్టుబెట్టి వచ్చిన తరువాత, ప్రపంచ దేశాలలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు మారుమ్రోగిపోయింది. ఆయనే స్వయంగా తుపాకీ, బాంబులు పట్టుకొని వెళ్ళి వారిని మట్టుబెట్టి వచ్చినట్లుగా అందరూ పొగిడారు. ఆ తరువాత నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి మళ్ళీ దేశ ప్రజల చేత, ప్రపంచ దేశాల చేత జేజేలు పలికించుకొన్నారు. 

ఆ రెండు నిర్ణయాలు చాలా సాహసోపేతమైనవే..వాటిని ప్రధాని నరేంద్ర మోడీయే తీసుకొన్నారు కనుక వాటి క్రెడిట్ ఆయనకే చెందుతుంది. క్రెడిట్ క్లెయిం చేసుకొంటున్నప్పుడు, వాటి దుష్ఫలితాలకి కూడా సహజంగానే ఆయనదే బాధ్యత అవుతుంది. ఒకవేళ సర్జికల్ స్ట్రయిక్స్ కారణంగా పాకిస్తాన్ భారత్ పై యుద్ధం ప్రకటించి ఉండి ఉంటే, అందుకు మోడీదే బాధ్యత అయ్యుండేది. కానీ కారణాలు ఎవయితేనేమి అదృష్టవశాత్తు పాక్ ఆ దుస్సహాసం చేయలేదు కనుక సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ పూర్తిగా మోడీకే స్వంతం అయ్యింది. 

కానీ నోట్ల రద్దు నిర్ణయం మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా, సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా వచ్చిన క్రెడిట్ కూడా దానితో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మొదట ఆయనకి జేజేలు పలికిన మీడియా, దేశప్రజలే ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తుండటం చూడవచ్చు. కారణాలు అందరికీ తెలిసినవే. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి నెల రోజులపైనే అయ్యింది కానీ నేటికీ దేశంలో పరిస్థితులు సామాన్య స్థితికి చేరుకోలేదు. 

నోట్ల కొరతని ప్రజలు కూడా అర్ధం చేసుకొంటున్నారు కానీ కొత్తగా ముద్రిస్తున్నా పెద్ద నోట్లన్నీ గాలి జనార్ధన రెడ్డి, శేఖర్ రెడ్డి వంటి అవినీతిపరులు తరలించుకుపోతున్న కారణంగానే తాము ఈ సమస్యలని ఎదుర్కోవలసి వస్తోందని గ్రహించి తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దేశంలో గాలి, శేఖర్ రెడ్డి వంటివారు వేలు, లక్షల సంఖ్యలో ఉన్నారు. వారినందరినీ పట్టుకోవడం ఒక్క ఆదాయపన్ను శాఖ వల్ల సాధ్యం కాదు కనుక వారు చెలరేగిపోతున్నారు. ఆ కారణంగా నెలరోజులైన సామాన్యుల నోట్ల కష్టాలు తీరడం లేదు. 

మొదట 50 రోజులలో ఈ సమస్యలన్నీ అధిగమించగలమని ధీమా వ్యక్తం చేసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు అంత ధీమాగా అదేమాట చెప్పలేకపోతోంది. అంటే ఈ సమస్యలు ఇంకా చాలా నెలల పాటు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఇవి ఎప్పటికి తీరుతాయో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకి తెలియదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలియదు..దేశ ప్రజలకి అంతకంటే తెలియదు. 

వచ్చే ఏడాది జరుగనున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొనే ప్రధాని నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రయిక్స్, నోట్ల రద్దు నిర్ణయాలని తీసుకొన్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే దేశ ప్రజలలో నెలకొన్న ఈ అసహనం కారణంగా ఆ ఎన్నికలలో భాజపా నష్టపోయే అవకాశం ఉంది. ఆ విధంగా జరుగకూడదని భావిస్తున్నట్లయితే, వీలైనంత త్వరగా కేంద్రప్రభుత్వం ఈ నోట్ల కష్టాలని తీర్చవలసి ఉంటుంది. అలాకాక ఇంకా నగదు రహిత లావాదేవీలు అంటూ ప్రయోగాలు చేస్తూ కాలక్షేపం చేసినట్లయితే అందుకు మూల్యం చెల్లించక తప్పక పోవచ్చు.


Related Post