జయలలిత మరణించక మునుపే అధికార అన్నాడిఎంకె పార్టీలో మొదలైన రాజకీయాలు, ఆమె అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజుకే పతాక స్థాయికి చేరుకొన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ మద్య పోయెస్ గార్డెన్ లో నిన్న అధికారం పంపకాలపై రాజీ కుదిరింది. అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకి ఇచ్చేందుకు పన్నీర్ సెల్వం వర్గం అంగీకరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న ఆమె, దానిని ఆయనకి వదిలి పెట్టినందుకు ప్రతిగా పార్టీలో, ప్రభుత్వంలో ఆమె అనుచరులకి కీలకపదవులు ఇవ్వాలనే షరతుకి పన్నీర్ సెల్వం వర్గం అంగీకరించినట్లు తెలుస్తోంది. కనుక ఆమెని పార్టీ కార్యదర్శిగా ఎన్నుకొనేందుకు త్వరలోనే పార్టీ కార్యాచరణ మండలి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
పార్టీ నియమ నిబందనల ప్రకారం ఆ పదవికి ఎవరినైనా ఎంపిక చేయాలంటే వందల మంది సభ్యులు గల పార్టీ సర్వసభ్య మండలిని సమావేశ పరిచి వారి ఆమోదం పొందవలసి ఉంటుంది. కనుక ఆమె ఎంపిక విషయంలో ఆ నిబందన ఉల్లఘించినట్లయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
ఏమైనప్పటికీ ఇరు వర్గాల మద్య నిన్న రాజీ కుదరడంతో అందరూ కలిసి మెరీనా బీచ్ లో జయలలిత సమాధి వద్దకి వెళ్ళి నివాళులు అర్పించడం ద్వారా తమ మద్య విభేదాలు సమసిపోయాయని చాటి చెప్పుకొన్నారు. కానీ ఇంతకాలం అమ్మ భజన చేసిన వారందరూ ఆమె అంత్యక్రియలు ముగిసిన మర్నాడే ఆమె వారసత్వం కోసం, ఆమె అధికారం కోసం ప్రాకులాడటం చూస్తే, వారు ఎక్కువ రోజులు సఖ్యతగా ఉండలేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. శశికళ పార్టీపై, ఆమె అనుచరులు ప్రభుత్వంపై పట్టు సాధించేందుకు తప్పకుండా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి కనుక వారు ఆ ప్రయత్నాలు చేయగానే ఇరు వర్గాల మద్య విభేదాలు మొదలవడం తధ్యం. అది ఎన్ని రోజులలో జరుగబోతోందనేదే ప్రశ్న.