ముందుగా కొత్త నోట్లు ముద్రించలేదుట!

December 09, 2016


img

సుప్రీంకోర్టులో నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ సుప్రీంకోర్టు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెపుతూ “నోట్ల రద్దు తరువాత దేశంలో ఏర్పడిన సమస్యలని కేంద్రప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని తగ్గించడానికి అనేక చర్యలు చేపడుతూనే ఉంది. అందుకే సమస్య మెల్లగా తగ్గుముఖం పడుతోందిప్పుడు. మరొక రెండు వారాలలో దేశంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నాము. నోట్ల రద్దు వలన దేశంలో జరుగరానిది ఏదో జరిగిపోబోతోంది అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి తప్ప నిజానికి అటువంటిదేమీ జరుగదు. నోట్ల రద్దు ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు కేవలం దురుదేశ్యంతోనే సమస్య తీవ్రత చాలా ఎక్కువగా చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాయి,” అని చెప్పారు.

ఆయన వాదన పూర్తిగా నిజమూ కాదు అబద్దమూ కాదని అందరికీ తెలుసు. కానీ సుప్రీంకోర్టు అడిగిన మరో ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం అబద్దమని చెప్పక తప్పదు. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు (అవసరమైనన్ని కొత్త నోట్లు ముద్రణ, దేశంలో అన్ని బ్యాంకులకి వాటిని చేరవేసి ప్రజలకి అందించడానికి అవసరమైన ఏర్పాట్లు వగైరా) చేసుకోకుండా నోట్లరద్దు చేసినందునే దేశంలో ఇన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రతిపక్షాల వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్న వేసినప్పుడు రోహాత్గీ చెప్పిన సమాధానం విస్మయం కలిగిస్తుంది. 

“ఆ నిర్ణయం ప్రకటించేవరకు ఎక్కడా కొత్తనోట్లు ముద్రించలేదని, ఆవిధంగా చేసినట్లయితే, ఆ నిర్ణయం ముందే అందరికీ తెలిసిపోయి దాని ప్రయోజనం నెరవేరదని” సుప్రీంకోర్టుకి చెప్పారు.

కానీ ఈ నిర్ణయం ప్రకటించడానికి ఆరు నెలలు ముందు నుంచే మైసూరులో గల ముద్రణాలయంలో కొత్తనోట్లు ముద్రించుతూ అత్యంత రహస్యంగా వాటిని ఎప్పటికప్పుడు ఒక ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానంలో రిజర్వ్ బ్యాంక్ కి తరలించేరని, ఈ నిర్ణయం ప్రకటించడానికి నెలరోజుల ముందుగానే దేశంలో అన్ని బ్యాంకులకి సీల్ చేసి ఉన్న రూ.2,000 నోట్ల బాక్సులు చేర్చి పంపిణీకి సిద్దంగా ఉంచారని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయం ప్రకటిస్తే, రెండు మూడు రోజుల తరువాత నుంచి దేశావ్యాప్తంగా ఆ కొత్త నోట్లు పంపిణీ మొదలవడం గమనిస్తే మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని నమ్మక తప్పదు. ఒకవేళ మీడియాలో వచ్చిన వార్తలు నిజమైతే, నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించక ముందు అసలు కొత్త నోట్లు ముద్రించలేదని ముకుల్ రోహాత్గీ చెప్పడం సుప్రీంకోర్టుకి అబద్దం చెప్పినట్లు కాదా? ఈ సమస్యలన్నీ రెండువారాలలో సమసిపోతాయని సుప్రీంకోర్టుకి కేంద్రప్రభుత్వం తరపున హామీ ఇవ్వడం మంచి వార్తే. ఆ రోజు కోసమే దేశ ప్రజలు అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. 


Related Post