అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం శర్వానంద్, మాళవిక నాయర్ ప్రధానపాత్రలలో ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బైకర్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. బైకర్ కోసం శర్వా ఎంతగా శ్రమించారో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో ‘బైక్ రేసర్’గా నటించేందుకు శర్వా ఏకంగా 26 కేజీలు బరువు తగ్గారు. బైక్ రేసింగ్ నేర్చుకున్నారు. ఈ క్రమంలో అనేకసార్లు గాయపడ్డారు. కానీ పట్టుదలగా ప్రయత్నించి బైకర్ పూర్తిచేశారు. ఈ సినిమా రెండు వేర్వేరు కాలాల్లో జరుగుతుంది. వాటిలో ఒకటి 90వ దశకంలో జరుగుతుంది. కనుక ఆనాటి రేసింగ్ బైక్స్ తెప్పించి షూటింగ్ చేశారు. ఈ సినిమాలో రేసింగ్ సన్నివేశాలు చాలా వరకు వాస్తవంగానే షూట్ చేశారు. దీని కోసం ప్రొఫెషనల్ రేసర్స్ ని రంగంలో దింపారు.
బైక్ రేసింగ్ స్టోరీతో వస్తున్న మొట్ట మొదటి భారతీయ సినిమా ఇదే. ఇదివరకు కొన్ని సినిమాలలో చిన్న బిట్స్ చూపారు. కానీ పూర్తిగా ‘బైక్ రేసింగ్’ సాగే సినిమా మాత్రం ఇదే.
ఈ సినిమాలో డా.రాజశేఖర్ శర్వాకి తండ్రి, కోచ్‌గా నటించారు. కనుక సినిమాలో బైక్ రేసింగ్‌తో పాటు తండ్రీ కొడుకుల మద్య ఘర్షణ, భావోద్వేగాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్; కెమెరా: జె యువరాజ్; ఎడిటింగ్: అనిల్ పాశాల; స్టంట్స్: దిలీప్ సుబ్రమణియన్; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం చేస్తున్నారు.
దీనిపై భారీ అంచనాలు ఉన్నందునే ప్రముఖ నిర్మాత, సినీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు బైకర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకోగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.27 కోట్లు చెల్లించి డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న బైకర్ ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది.