మోడీ పార్లమెంటుకి వస్తే ఫినిష్: రాహుల్

November 25, 2016


img

“నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకి ప్రధాని నరేంద్ర మోడీ జవాబు చెప్పలేక పార్లమెంటుకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఒకవేళ మా పోరు భరించలేక వచ్చినా మౌనం వహిస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం పెద్ద కుట్ర అని మేము భావిస్తున్నాము. కానీ కాదని ఆయన అంటున్నారు. పార్లమెంటులో నోరు విప్పని మోడీ, బయట మాత్రం దాని గురించి చాలా గట్టిగా, భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. ఆయన ఇంకా ఎంత కాలం పార్లమెంటుకి రాకుండా తప్పించుకొని తిరుగుతారో మేము చూస్తాం. ఒకసారి ఆయన పార్లమెంటుకి వచ్చి దీనిపై చర్చలో పాల్గొంటే మేము అడగవలసిన ప్రశ్నలు మేము అడుగుతాము. ఆయన చెప్పదలచుకొన్నది ఆయనని చెప్పనిస్తాం. అప్పుడు నీళ్ళకి నీళ్ళు ...పాలకి పాలు వేరయిపోతాయి. అప్పుడు దేశాన్ని ఎవరు మోసం చేస్తున్నారో దేశ ప్రజలు అందరూ స్వయంగా చూస్తారు.” 

ఈ మాటలు అన్నది మరెవరో కాదు గత ఏడాది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే రాజకీయాలకి ‘శలవు’ పెట్టి రెండున్నర నెలలు విదేశాలకి పారిపోయిన రాహుల్ గాంధీయే. 

నోట్ల రద్దు వెనుక చాలా పెద్ద కుట్ర దాగుందని, మోడీకి సన్నిహితులకి మేలు చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారని రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్షాలు ఇప్పటికి రెండు వారాలుగా ఆరోపిస్తున్నాయి కానీ ఇంతవరకు ఆ కుట్ర ఏమిటో చెప్పలేకపోతున్నాయి. అసలు నోట్ల రద్దుని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నాయి. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే చెపుతున్నాయి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దుకి అనేక బలమైన కారణాలు చెపుతున్నారు. దాని వలన దేశానికి మున్ముందు కలుగబోయే లాభాలని కూడా వివరించి చెపుతున్నారు. సామాన్య ప్రజల కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయని భరోసా ఇస్తున్నారు. అంతే కాదు..తన నిర్ణయంపై వెనకడుగువేసే ప్రసక్తే లేదని నిర్ద్వందంగా చెపుతున్నారు. 

మోడీ మౌనం వహించడం వ్యూహాత్మకమే అనిపిస్తోంది. ఈ నోట్ల కష్టాలు తీరేవరకు ప్రతిపక్షాల ఒత్తిడిని తట్టుకొని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటే వాటితో యుద్దానికి తలపడే బదులు మౌనం వహించడమే మంచిదని భావిస్తున్నారేమో. ఒకవేళ ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకొని వాటితో దీనిపై చర్చకి దిగితే అది ఎటువైపైనా మలుపు తిరుగవచ్చు. ఒకవేళ ఆ కారణంగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలసిన పరిస్థితులు ఏర్పడితే, దాని వలన అప్పుడు దేశం నిజంగానే ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోతుంది. బహుశః అందుకే మోడీ మౌనం వహిస్తున్నారేమో.

అయితే ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలని పార్లమెంటులో తప్పకుండా ఎదుర్కొని జవాబు చెప్పడం ఖాయం. కానీ దానికి మరికొంత సమయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లున్నారు. అంతే!  


Related Post