నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో ఫిబ్రవరి 22 ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది కార్మికులు చనిపోగా, అదృష్టవశాత్తు 42 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
అప్పటి నుంచి ఈ నెలరోజులుగా దేశం నలుమూలల నుంచి వివిద ప్రభుత్వ, ప్రైవేట్ ఏజన్సీలు, ఆర్మీ, నేవీ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఈ రంగంలో నిపుణులు, ఇటువంటి పనులలో నిష్ణాతులైన కార్మికులు ఎంతో మంది వచ్చి శతవిధాలా ప్రయత్నించినా ఇంతవరకు ఓకే ఒక్క మృతదేహం వెలికి తీయగలిగారు. మిగిలిన వారి మృతదేహాలు ఇంకా బురద, శిధిలాలు, కాంక్రీట్ కిందనే ఉండిపోయాయి.
ఇప్పటికే నెలరోజులు గడిచిపోయినందున ఇప్పుడు ఏం చేయాలి? మృతదేహాలను అలాగే విడిచిపెట్టి విదేశాల నుంచి కొత్త టన్నల్ బోరింగ్ యంత్రం తెప్పించి పనులు మొదలుపెట్టాలా?లేదా ఇక్కడితో ఈ ప్రాజెక్టు రద్దు చేసి పనులు నిలిపివేయాలా?దీనికి వేరే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా?ఉంటే వాటికి ఎంత ఖర్చు అవుతుంది?వంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం కనుగొనవలసి ఉంటుంది.
సిఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రులు, సంబంధిత అధికారులు, నిపుణులతో సమావేశమై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.