నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోపెట్టిండ్రుగా?

March 23, 2025


img

తెలంగాణ మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నిన్న తన ఫామ్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణకు తాగు, సాగు నీళ్ళు అవసరం. కానీ ఆంధ్రా పాలకులు సాగునీటి సమస్యని ఓ ఆర్ధిక సమస్యగా మాత్రమే చూస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. ఆ కోపంతోనే నేను వారిని దద్దమలు, సన్నాసులు అన్నానే తప్ప వారిపై నాకు ఎటువంటి కోపమూ లేదు. 

భౌగోళిక, వాతావరణ పరిస్థితులను, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు పనిచేయాలి తప్పితే త్రాగు, సాగునీటి సరఫరాకు లెక్కలు కట్టుకోకూడదు. ఎంత ఖర్చయినా ప్రభుత్వాలు వెనకడుగు వేయకుండా ప్రజలకు, రైతులకు త్రాగుసాగు నీటిని అందించాలి. నేను అదే చేశాను. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం, సాగు, త్రాగు నీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నేను ప్రాజెక్టులు కట్టించాను. రాష్ట్రమంతా నీళ్ళు పారించాను. రైతులకు పంట పెట్టుబడి, 24 గంటలు ఉచిత విద్యుత్ అందించాను. గిట్టుబాటు ధర కల్పించాను. పండిన పంటని కొనుగోలు చేశాను. 

నా పాలనలో నీళ్ళతో కళకళలాడిన తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం మారగానే కేవలం 15 నెలల్లోనే ఎందుకు ఎండిపోయింది? ఎక్కడ చూసిన మళ్ళీ నీళ్ళ కరువు ఎందుకు తాండవిస్తోంది?

తెలంగాణకు కాంగ్రెస్‌ మొదటి శత్రువని మొదటి నుంచి నేను చెపుతూనే ఉన్నాను. కాంగ్రెస్‌ నేతలకు రాష్ట్రాన్ని దోచుకోవడంపై ఉన్న శ్రద్ద రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయడంపై లేదు. 

నేను పేద ప్రజల కష్టాలను అర్దం చేసుకొని వారికోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తే, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రాతో పేదల ఇళ్ళు కూల్చివేస్తోంది. అప్పుడు ఎక్కడున్నావు కేసీఆర్‌ అన్నా?అంటూ ప్రజలు నన్ను పిలుస్తుంటే నేనేమి చేయగలను. మీరే కదా.. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. కత్తి ఒకరికిచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎలా చేయగలను? 

రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని పత్రికలలో వార్తలు చూస్తున్నాను. ఆ ముసుగులో చంద్రబాబు నాయుడు, మళ్ళీ మనపై పెత్తనం చేయడానికి వస్తున్నారు. కనుక యువత అప్రమత్తంగా కనిపెట్టుకొని మన రాష్ట్రాన్ని పరాయి పాలకుల నుంచి కాపాడుకోవాలి,” అని కేసీఆర్‌ అన్నారు. 


Related Post