నోటితో ఓ మాట.. బడ్జెట్‌ ప్రతిలో మరో మాట!

March 19, 2025


img

ఈరోజు తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై బిఆర్ఎస్ పార్టీ నేతలు స్పందన ఊహించిన్నట్లే ఉంది. అయితే ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బడ్జెట్‌లో ఓ ఆసక్తికరమైన విషయం మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. 

శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆమె బడ్జెట్‌ ప్రతిని చూపిస్తూ, “సిఎం రేవంత్ రెడ్డి అప్పుల విషయంలో అబద్దాలాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. గతంలో మా ప్రభుత్వ హయంలో కేసీఆర్‌ రూ.7.5 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారని, వాటికి అసలు వడ్డీ చెల్లించడానికి ముప్ప తిప్పలు పడుతున్నామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

తమ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలోనే అసలు, వడ్డీ కలిపి రూ.1.40 లక్షల కోట్లు చెల్లించిందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పారు. కానీ వారు ముద్రించి ఇచ్చిన ఈ బడ్జెట్‌ ప్రతిలో మొత్తం రూ.30 వేల కోట్లు మాత్రమే చెల్లించిన్నట్లు చూపారు. అంటే 30 వేల కోట్లు మాత్రమే చెల్లించి రూ.1.40 లక్షల కోట్లు చెల్లించామని ఓ అబద్దం చెపుతున్నారన్న మాట! 

ఇక సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో, బయట పదేపదే కేసీఆర్‌ రూ.7.50 లక్షల కోట్లు అప్పులు చేసి పోయారని చెపుతుంటారు. కానీ ఈ బడ్జెట్‌ ప్రతిలో రూ.4.7 లక్షల కోట్లు మాత్రమే ఉందని పేర్కొన్నారు. 

సిఎం రేవంత్ రెడ్డి చేసిన అప్పు రూ.1.58 లక్షల కోట్ల అప్పు కూడా కలిపి మొత్తం రూ.4.7 లక్షల కోట్లు అని ఈ బడ్జెట్‌ ప్రతిలో పేర్కొన్నారు. ఈవిదంగా సిఎం అబద్దాలు చెపుతూ ప్రజలను మోసగిస్తున్నారనే విషయం వారు సమర్పించిన బడ్జెట్‌ ప్రతితోనే బయటపెట్టుకున్నారు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 


Related Post