తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనసభ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల లబ్ధిదారులే మా ఓటర్లు. వచ్చే ఎన్నికలలో వారే మా పార్టీని మళ్ళీ గెలిపిస్తారు. మళ్ళీ నేనే ముఖ్యమంత్రినవుతా,” అని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పధకాల గురించి వివరించి వాటితో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారన్నారు.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పధకాలను మాత్రమే నమ్ముకొని ఎన్నికలలో 175 కి 175 సీట్లు మేమే గెలుచుకుంటామని ధీమా ప్రదర్శించేవారు. కానీ ఆయన విధానం తప్పని, దాని వలన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, అభివృద్ధిలో వెనుకపడిపోతోందని ప్రతిపక్షాలు ఎంతగా వారించినా జగన్ పట్టించుకోలేదు.
లక్షల కోట్లు అప్పులు చేసి తెచ్చి సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు ఆ డబ్బంతా పంచి పెట్టినా 175కి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. పైగా రాష్ట్రాన్ని, రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించేశారనే అపకీర్తి జగన్‌కి మిగిలిపోయింది. జగన్ పాలన రుచి చూసిన ఏపీ ప్రజలు మళ్ళీ ఆయనకు ఎప్పటికైనా అవకాశం ఇస్తారో లేదో తెలీదు.
కనుక సంక్షేమ పధకాలను, లబ్ధిదారులను నమ్ముకొని మళ్ళీ అధికారంలోకి వస్తామనుకోవడం చల్ఆ ప్రమాదకరమైన ఆలోచన.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన నుంచి ఏం ఆశించి అధికారం అప్పగించారో జగన్ గుర్తించలేక తన ఇష్టానుసారం చేయడం వల్లనే అధికారం కోల్పోయారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ని కాదని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అధికారం కట్టబెట్టారో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకొని, తదనుగుణంగానే పాలన చేయాలి. నడుచుకోవాలి. అప్పుడే మళ్ళీ అధికారంలోకి రావడం గురించి ఆలోచించవచ్చు. లేకుంటే చరిత్ర పునరావృతం అవుతుంది అంతే!