బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసినందుకు నిరసనగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని, స్పీకర్ నిర్ణయాన్ని తప్పు పడుతూ బిఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
నిన్న రోజంతా హడావుడి చేసిన తర్వాత, ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే హరీష్ రావు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని స్పీకర్‌కి విజ్ఞప్తి చేస్తుండటం విడ్డూరంగా ఉంది.
హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “మాకు స్పీకర్ అంటే చాలా గౌరవం ఉంది. ఆయన ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు మేము సహకరించాము. జగదీష్ రెడ్డి ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. కాంగ్రెస్ సభ్యులే ఆయన మాటలను వక్రీకరించి సస్పెన్షన్ వేటు వేయించారు.
జగదీష్ రెడ్డికి వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించి ఉంటే ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆవిదంగా మాట్లాడారో వివరించి ఉండేవారు. కానీ ఆయన వివరణ ఆడగకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. కనుక దీనిపై స్పీకర్ పునరాలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.
జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిన తర్వాత హరీష్ రావు అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, “ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వెనకాడము,” అని హెచ్చరించారు. కానీ ఇప్పుడు స్పీకర్ అంటే తమకు చాలా గౌరవమని చెపుతున్నారు!
జగదీష్ రెడ్డి విషయంలో పంతానికి పోయి కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకొని ఎదురుదెబ్బ తిన్నామని బిఆర్ఎస్ పార్టీ గ్రహించినందునే హరీష్ రావు యూ టర్న్ తీసుకున్నారా? అనే సందేహం కలుగుతోంది.