మీడియా ముందుకు విజయశాంతి.. అందువల్లే?

March 15, 2025


img

ఒకప్పుడు విజయశాంతి తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి బిఆర్ఎస్, బీజేపి, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలలో పనిచేశారు కూడా. ఇంత బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆమెకు ఏ పార్టీలో పెద్దగా ప్రాధాన్యం, గుర్తింపు లభించలేదనే చెప్పాలి. 

ఆయా పార్టీలలో నాయకుల మద్య పోటీలో ఆమె వెనుకబడిపోవడం ఓ కారణమైతే, రాజకీయ పార్టీలు ఆమెను ఓ రాజకీయ నాయకురాలిగా కాక సినీ సెలబ్రెటీగా మాత్రమే చూడటం మరో కారణంగా కనిపిస్తోంది. కనుక ఆమె ఈ విషయం గ్రహించి ఓ సినీ సెలబ్రెటీగా తనకున్న గుర్తింపుని చాకచక్యంగా ఉపయోగించుకుంటూ రాజకీయాలలో రాణించే ప్రయత్నం చేసి ఉంటే నేడు ఆమె మరో స్థాయిలో ఉండేవారు. 

కానీ పార్టీల అధినేతలు, వాటిలో సాటి నేతలు తనకి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే బాధతో ఆమె పార్టీలకు, వాటి కార్యక్రమాలకు దూరంగా ఉండిపోవడం వలన రాజకీయాలలో వెనుకబడిపోయారని చెప్పక తప్పదు. అయితే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ఆమె చాలా చురుకుగా ప్రయత్నించడంతో సీటు దక్కించుకున్నారు. 

ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు కనుక ఆమె తన సమర్ధత నిరూపించుకోవడానికి మరో గొప్ప అవకాశం లభించింది. ఎమ్మెల్సీగా మండలిలో తన గొంతు గట్టిగా వినిపించగలిగితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో రాణించగలరు. కానీ ఈ పదవి కేవలం కాలక్షేపానికి, గుర్తింపుకి మాత్రమే అనుకుంటే ఎన్నటికీ రాజకీయాలలో రాణించలేరు. 

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మొన్న శాసనసభలో స్పీకర్‌ని కించపరుస్తున్నట్లు మాట్లాడటంపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, కేసీఆర్‌ ఇంకా దొరతనం ప్రదర్శిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే వింటే బాగుటుంది. కానీ ఇంతకాలం పార్టీకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? అంటే ఎమ్మెల్సీ పదవి లభించింది కనుకనే అని అనుకోక తప్పదు.            


Related Post