ఇటీవల జరిగిన ఒక ఉపాధ్యాయ, రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపి రెండు సీట్లు దక్కించుకోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్న తీరు ఆలోచింపజేస్తుంది.
కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకే బిఆర్ఎస్ పార్టీ బీజేపితో చేతులు కలిపిందని, అందువల్లే ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయిందని కానీ దీనిని పెద్ద అపజయంగా అనుకోలేమన్నారు. బీజేపితో చేతులు కలిపినందునే బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేయలేదని, ఎన్నికలలో బీజేపి అభ్యర్ధుల గెలుపుకు కూడా కృషి చేసిందని వారిరువురూ వాదించారు.
ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కనుక కేసీఆర్, హరీష్ రావు తదితర బిఆర్ఎస్ నేతలు ఏ పార్టీకి ఓట్లు వేశారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ మద్దతు లేకుంటే బీజేపి అభ్యర్ధులు గెలవగలిగి ఉండేవారా?
రెండు పార్టీలు కుమ్మక్కవ్వడం వలననే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తప్ప ఆ రెండు పార్టీలు చెప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగినందున కాదని కాంగ్రెస్ నేతలు వాదించారు.
ఎన్నికలలో ఇటువంటివి జరుగుతాయని కాంగ్రెస్ నేతలకు తెలియనంత అమాయకులు కారు. కనుక ఒకవేళ బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు చేతులు కలిపిన్నట్లు గమనిస్తే వాటిని ఎదుర్కొని విజయం సాధించేందుకు తగిన వ్యూహాలు రూపొందించుకొని అమలుపరిచి గెలిచి చూపాలి. కానీ ఆ రెండు పార్టీలు మోసం చేయడం వల్లనే మేము ఓడిపోయామని చెప్పుకోవడం సంజాయిషీ ఇచ్చుకోవలసి రావడం వారికీ అవమానమే కదా?